తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తుండటంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. తెలుగుదేశం పార్టీపై ఏదో రకంగా బురద జల్లి ప్రజల్లో అల్లరి పాలు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీసీలకు అన్యాయం జరుగుతుందని వెనుకబడిన కులాలకు రావాల్సిన రూ. 6500 కోట్లను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని అచ్చెన్నాయుడు ప్రశ్నించిందుకే ఇలాంటి కేసుల్లో ఆయనను ఇరికిస్తున్నారని రవీంద్ర ఎద్దేవా చేశారు.

Also Read:ఈఎస్ఐ స్కామ్: మోడీపైకి నెట్టేసిన అచ్చెన్నాయుడు

త్వరలోనే అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడిని అరెస్ట్ చేస్తామని సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ముందుగానే చెప్పారని ఈ పథకంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని కొల్లు ఆరోపించారు.

బీసీ నాయకులుగా ఉన్న వారిద్దరిని జగన్ టార్గెట్ చేసి కుట్రలు చేస్తున్నారని ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పేరును కావాలనే బయటకు తీశారని రవీంద్ర మండిపడ్డారు. బీసీలంటే జగన్ ప్రభుత్వానికి చులకన.. వెనుకబడిన వర్గాలంటే నోరు ఎత్తరని మీరు భావిస్తున్నారని అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని కొల్లు హెచ్చరించారు.

Also Read:మోడీ ఆదేశాల మేరకే, విచారణ చేసుకోవచ్చు: ఈఎస్ఐ కుంభకోణంపై అచ్చెన్నాయుడు

చంద్రబాబు పీఎస్ ఇంటిలో జరిగిన ఐటీ దాడుల్లో రూ.2.6 లక్షలు దొరికితే దానిని రూ.2 వేల కోట్లని అసత్య ప్రచారం చేశారని ఇవన్నీ ఇకపై సాగవని మాజీ మంత్రి స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుడిగా అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన తెలిపారు.

నాయకులుగా ఎదుగుతున్న బలహీన వర్గాలకు చెందిన వారిని ఏదో ఒక రకంగా స్కామ్‌ల్లో ఇరికించి వాళ్లని ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొల్లు ఆరోపించారు. ప్రభుత్వం తీరుపై బలహీన సంఘాల నాయకులంతా ఏకమై ఉద్యమిస్తారని రవీంద్ర హెచ్చరించారు.