Asianet News TeluguAsianet News Telugu

జూ. ఎన్టీఆర్ తల్లిని తిట్టిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా?: కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా? అంటూ ఫైర్ అయ్యారు.

EX Minister Kodali Nani Slams Chandrababu naidu and nara lokesh ksm
Author
First Published May 29, 2023, 12:07 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్‌లు శనిగాళ్లు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో టీడీపీ ఫేజ్ 1 మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను.. చంద్రబాబును పొగిడించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని విమర్శించారు.

వేదికపై చంద్రబాబు, లోకేష్‌ల ఫొటోలు మాత్రమే పెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ బొమ్మ వేదికపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ పాదయాత్రకు వెళ్లి మరణించిన తారకరత్న ఫొటోలు ఎందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవనేని లోకేష్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. ఎన్టీఆర్‌ను 8 ఏళ్లు అత్యంత క్రూరంగా హింసించారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయనతో ఉన్న వెధవలంతా ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారని విమర్శించారు. 

1994లో ఎన్టీఆర్ ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను, 1999, 2014లలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దాలను చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. 2014లో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇచ్చారా?, డ్వాక్రా మహిళలకు రుణాలను రద్దు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టిన ఏ మేనిఫెస్టోపై అయినా కూడా చర్చకు సిద్దమేనని ప్రకటించారు. తాము 2019లో పెట్టిన మేనిఫెస్టోను తీసుకుని చర్చకు వస్తామని తెలిపారు. అలాగే 2004, 2009 రాజశేఖర్ రెడ్డి మేనిఫెస్టోను కూడా తీసుకుని వస్తామని అన్నారు. 2004లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరూపిస్తే తాము వైసీపీని మూసేస్తామని తెలిపారు. 

చంద్రబాబు వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఇస్తున్న హామీలను తీసుకొచ్చి.. మేనిఫెస్టోలో పెడుతున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్లు వేయించుకోవడానికే చంద్రబాబు తాపత్రయం అని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకు చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. 

జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు.  నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు  ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయవవద్దని నిర్మాతలను బెదిరించారని చెప్పుకొచ్చారు.  జూనియర్ ఎన్టీఆర్‌ వాళ్ల మీటింగ్‌ రాలేదని ఆయన తల్లిని ఇష్టం వచ్చిన తిట్టిపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా?.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆడవాళ్లు కాదా? అని ప్రశ్నించారు.  

బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు, అగ్ర కులాల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట మీద నిలబడి న్యాయం చేసే ఏకైక వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని అని అన్నారు. చంద్రబాబు బీసీలకు వెన్నుముక్క కాదని.. ఎన్టీఆర్ బీసీలకు వెన్నుముక్క అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు, అగ్ర కులాల్లో ఉన్న పేదలను మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం అని విమర్శించారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడుని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నట్టుగా పేర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను మహానగరం చేశానని చెబుతాడని.. అక్కడ ఒక్క సీటు అయినా గెలుస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ , 420 అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios