Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ వల్లే ఏరియల్ సర్వే, మూర్ఖపు ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుద్ది: జగన్ కు దేవినేని శాపనార్థాలు

ప్రజలు నానా కష్టాలు పడుతుంటే సూటు బూటు వేసుకుని సొంత పనుల నిమిత్తం అమెరికాలో పర్యటించేందుకా మీకు అధికారం ఇచ్చింది అంటూ ప్రశ్నించారు. ఏ1 అమెరికాలో ఉంటే ఏ2 న్యూఢిల్లీలో ఉన్నారని ఇకపోతే ఏ3 సెర్బియాలో ఉన్నారంటూ మండిపడ్డారు. 
 

ex minister devineni uma maheswara rao serious comments on cm ys jagan
Author
Vijayawada, First Published Aug 19, 2019, 8:56 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏపీలో పరిపాలనను సీఎం వైయస్ జగన్ గాలికొదిలేశారంటూ ఆరోపించారు. 

గతంలో గోదావరి నది వల్ల ఉభయగోదావరి జిల్లాలో వరదలు సంభవిస్తే జగన్ జెరూసలేంలో పర్యటించారని విమర్శించారు. అయితే ప్రజల పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు వారికి భరోసా ఇచ్చేందుకు మాజీమంత్రి నారా లోకేష్ పర్యటించారని తానున్నానంటూ భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

మాజీమంత్రి నారా లోకేష్ ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించడం వల్లే సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారని ఆరోపించారు. ఏరియల్ సర్వే నిర్వహించి ప్రజలకు ఏం చేశారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏమీ చెప్పకుండా వెళ్లిపోయారంటూ విరుచుకుపడ్డారు.

ఇకపోతే తాజాగా కృష్ణానదికి వరదలు వస్తే సీఎం జగన్ అమెరికాలో పర్యటిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పనుల కోసం అమెరికాలో పర్యటించడం అవసరమా అంటూ విరుచుకుపడ్డారు.  

ప్రజలు నానా కష్టాలు పడుతుంటే సూటు బూటు వేసుకుని సొంత పనుల నిమిత్తం అమెరికాలో పర్యటించేందుకా మీకు అధికారం ఇచ్చింది అంటూ ప్రశ్నించారు. ఏ1 అమెరికాలో ఉంటే ఏ2 న్యూఢిల్లీలో ఉన్నారని ఇకపోతే ఏ3 సెర్బియాలో ఉన్నారంటూ మండిపడ్డారు. 

 మాటలు చెప్పినంత తేలికకాదు పరిపాలన అంటూ మండిపడ్డారు. పరిపాలన అంటే సొంత పనులు కోసం సూటు బూటు వేసుకుని తిరగడం కాదన్నారు. జగన్ అమెరికాలో ఉంటే రాష్ట్రమంత్రులు సన్మానాలు చేయించుకుంటున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఇళ్లును ముంచడమే పనిగా పెట్టుకుని మంత్రులు ఆయన ఇంటిచుట్టూనే తిరుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ రైతాంగం నీళ్లు లేక గొంతు ఎండుతుంటే 18 రోజులుగా కృష్ణా డెల్టాలో రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పరిపాలన చేతగాక పోతే నేర్చుకోండి.. మా జీవితాలను నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలుసుకోవాలంటూ సూచించారు. 

చంద్రబాబు ఇళ్లు తప్ప వైసీపీకి ఇంకేమీ కనబడటం లేదన్నారు. చెబితే వినరు మీకు తెలిసనట్లు చేయరు ఇది మూర్ఖత్వపు ప్రభుత్వమంటూ దుయ్యబుట్టారు. 275 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాల్జేశారంటూ మండిపడ్డారు. 

రీ టెండర్‌పై ఉన్న శ్రద్ధ వరదల నియంత్రణపై లేదని బాధ్యతకలిగిన అధికారులు పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్‌పై దృష్టిపెట్టారని విమర్శించారు. గత రెండు నెలలుగా ఈ ప్రభుత్వం పోలవరంలో ఒక్క పని కూడా చేపట్టలేదంటూ ఆరోపించారు. 

జగన్ కు 90వేలు మెజారిటీ ఇవ్వడం ప్రజలు చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తే రాత్రి 10గంటలకు కంట్రోల్ రూమ్ పెట్టారని, కోట్లాది రూపాయల పంట నష్టం జరిగిందని, నిర్వాసితులకు మంచి  నీళ్లు కూడా ఇచ్చే వారు లేరని మండిపడ్డారు.  

2009లో వచ్చిన ఫ్లడ్ రికార్డులు ఖాతరు చేయకుండా ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరించిందని ఆరోపించారు. కృష్ణా డెల్టాలో వచ్చే వరదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో 42లక్షల హెక్టార్ల సాగు భూమిలో ఎంత ఖరీఫ్ సాగు చేస్తున్నారని ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికే 85శాతం పంటలు పూర్తి కావాలీ కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం  వల్ల 55శాతం మాత్రమే పంటలు వేశారంటూ నిప్పులు చెరిగారు.  

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి గేట్ లు ఎత్తతితే మన మంత్రులు వెళ్లారని, పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తితే పక్క రాష్ట్ర అధికారులు ఎందుకు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారో సీఎం జగన్ స్పష్టం చేయాలని దేవినేని ఉమా మహేశ్వరరావు  నిలదీశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios