అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి ఘటనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్ పై దాడికి పాల్పడింది ఆయన వీర అభిమాని అంటూ టీడీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు లేదంటే దండలు వేసి అభిమానం చాటుకుంటారు కానీ హత్యాయత్నం చేస్తారా అంటూ టీడీపీ నేతలను నిలదీశారు.

హత్యాయత్నం చేసిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్‌ అభిమాని అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఘటనకు సంబంధించి వాస్తవాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని వైసీపీ నేత బొత్స ఝాన్సీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేని ప్రభుత్వం, సామాన్యుడికెలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు.