సారాంశం

తనను తీహార్ జైల్లో పెట్టినా గెలుస్తానని అన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఏవీ సుబ్బారెడ్డి పార్టీలోనే వున్నా..ఈ నాలుగేళ్లు ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. తనను ఎంతగా అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు అండగా వుంటానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. 

టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తీహార్ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తానని ఆమె స్పష్టం చేశారు. బుధవారం అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ.. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేసి కేసులు పెట్టారని ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి చున్నీ లాగారని ఫిర్యాదు చేస్తే తనను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళకే హోంమంత్రి పదవిని ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డి వున్నా..ఈ నాలుగేళ్లు ఎక్కడికి వెళ్లారని అఖిలప్రియ ప్రశ్నించారు. పార్టీలో వున్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఎంతగా అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు అండగా వుంటానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. 

Also Read: ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. ఆధారాలతో మీడియా ముందుకొస్తా : అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

కాగా.. నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఈ నెల 16న నంద్యాల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపల్లి వద్ద నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు గాను భూమి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి తన మద్ధతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం నడిచింది. ఇదే సమయంలో అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సుబ్బారెడ్డిని కారులో వెనక్కి పంపారు. దీనిపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అఖిలప్రియ సహా మరికొందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో వీరికి కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.