అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

జగన్ ప్రభుత్వానికి పాలన చేతకాదన్నారు. విచారణ అంటూ కమిటీలు అంటూ నానా హంగామా చేసి పాలనను గాలికొదిలేశారంటూ విరుచుకుపడ్డారు. ఆసరా పెన్షన్లపై జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. 

ఆసరా పెన్షన్లు ఎంతమందికి ఇచ్చాం, ఎంత ఇచ్చామో తేల్చేందుకు చర్చకు సిద్ధమా అంటూ జగన్ కు సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికీకరణకు ఎంతో దోహదం చేసిందని చెప్పుకొచ్చారు. అందుకు నిదర్శనమే పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 

మరోవైపు కియామోటార్స్ కంపెనీ వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లే వచ్చిందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. బుగ్గనకు మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ నిలదీశారు.  2009లో చనిపోయిన వైయస్ చెబితే 2017లో కియా కార్ల కంపెనీ వచ్చిందా అంటూ నిలదీశారు. 

కియామోటార్స్ కు ఎకరా ఆరు లక్షలకు తమ ప్రభుత్వం అందజేస్తే దాన్ని రూ. 60లక్షలకు పెంచేసి ఒక భయాన్ని క్రియేట్ చేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమంటూ ఆరోపించారు. ప్రభుత్వ భూముల ధరలు పెంచడంతో కియామోటార్స్ తోపాటు అనుబంధ సంస్థలు ముందుకు రావడం లేదన్నారు. 

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలను భయపెడుతున్నారంటూ ఆరోపించారు. స్థానికులకు 75శాతం రిజర్వేషన్ లు లేకపోతే ఇబ్బంది పడుతారంటూ హెచ్చరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఫలితంగా కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు.  

ఇకపోతే కియామోటార్స్ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన అంశంపై స్పందించిన అచ్చెన్నాయుడు అది సీఎం జగన్ ను సంతోషపరిచేందుకేనన్నారు. పిచ్చోడిచేతిలో రాయి పాలనలా వైయస్ జగన్ ప్రజావేదిక కూల్చివేశారంటూ ధ్వజమెత్తారు. 

ప్రజావేదిక లాంటి పరిస్థితి తమకు ఎక్కడ వస్తుందోనన్న భయంతో కియా మోటార్స్ భయంతో లేఖ రాసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ వల్లే కియా వచ్చిందంటూ వైసీపీ చేస్తున్న వార్తలు సరికాదన్నారు. 

రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా టీడీపీ ప్రభుత్వం వల్లే కియామోటార్స్ వచ్చిందని చెబుతారన్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కియాపై ఆర్థిక మంత్రి వక్రభాష్యం చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఇకపోతే 2009లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారని గుర్తు చేశారు. 2009లో వైయస్ చనిపోతే 2017లో కియా కంపెనీ వచ్చిందా అంటూ సెటైర్లు వేశారు. కియా కంపెనీ ప్రతినిధులతో వైఎస్ కలలో చెప్పాడేమో అంటూ పంచ్ లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని చెప్పుకొచ్చారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.