నా మంత్రి పదవి పీకేసి జగన్ మంచే చేశారు : అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
తన మంత్రి పదవి పీకేసి సీఎం జగన్ మంచే చేశారని అన్నారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిర్వేదంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.. 2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు. తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా.. అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచించారు.
తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని ఆయన తెలిపారు. వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని.. తనకు వెయిట్ లేదని తనను పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు.. కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని.. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు. ప్రజలే తన వెంట వున్నారని అనిల్ చెప్పారు.
ALso Read: ఏం జరిగినా నాపేరు లాగుతారా.. వ్యక్తిగత గొడవలతోనే కోటంరెడ్డిపై దాడి : అనిల్ కుమార్ యాదవ్
ఇకపోతే.. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన తొలి కేబినెట్‌లో అనిల్ కుమార్ యాదవ్‌కు కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానన్న జగన్.. చెప్పినట్లుగానే పాత కేబినెట్‌లో కొందరు మినహా కొత్త వారిని మంత్రులుగా చేశారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్‌ను తప్పించి ఆయన స్థానంలో అంబటి రాంబాబుకు జలవనరుల శాఖను అప్పగించారు ముఖ్యమంత్రి.