అమరావతి: అమరావతి విషయంలో మాజీ ఐజీ సుందర్ కుమార్ దాస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధానిని నిర్ణయించే సమయంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని, పాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకోలేదని ఆయన ఆరోపించారు. 

ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో తన వాదనలు కూడ వినాలని ఆయన ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.  సోమవారం నాడు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా నిర్ణయించిందని ఆయన తన పిటిషన్ లో అభిప్రాయపడ్డారు. ప్రజల ఆమోదం మేరకు రాజధానులు ఏర్పాటయ్యాయన్నారు. 

ఏపీ పునర్విభజన చట్టం మేరకు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం నామమాత్రంగానే మార్చేసిందని ఆయన ఆరోపించారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులకు విరుద్దంగా విజయవాడ- గుంటూరు మధ్యలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో గత ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. 

అప్పటి పాలకవర్గానికి చెందిన వారికి లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశ్యంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు. ఇందులో అనేక రాజకీయ ప్రయోజనాలు కూడ ముడిపడి ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొందన్నారు. శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ సమీక్ష చెల్లదని ఆయన ఆ పిటిషన్ లో అభిప్రాయపడ్డారు.

అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పర్యావరణం, సామాజిక ఆర్ధిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ఇన్స్ పెక్షన్ ప్యానెల్ నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన ఆ పిటిషన్ లో గుర్తు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకొందన్నారు.