Asianet News TeluguAsianet News Telugu

నాపై వ్యతిరేకత లేదు... జనమే మోసపోయారు: జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 45.60 శాతం ఓట్లతో 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 6.85 శాతం ఓట్లతో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, 2.83 శాతం ఓట్లతో భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అంటే 55 శాతంపైగా ఓట్లను కూటమే గెలుచుకుంది. అయినా కూటమి విజయాన్ని విజయంగా వైసీపీ ఒప్పుకోవడం లేదు.’’

Ex CM YS Jagan's interesting comments GVR
Author
First Published Jul 5, 2024, 9:36 AM IST

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రియాలిటీలోకి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ గెలుచుకున్న ఆయన పార్టీ.. ఈసారి 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా వాస్తవంలోకి రావడం లేదు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ-జనసేన-బీజేపీ 164 సీట్లు గెలుచుకుంది. అయితే, కూటమి విజయాన్ని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. గురువారం నెల్లూరులో పర్యటించిన జగన్‌... ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో రిమాండ్‌ ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన జగన్‌... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎందుకు ఓటేశారో ఆలోచించుకోవాలని చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. ప్రజలకు మంచి చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని... తమపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులై... ఆ 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్‌ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. 

గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీకి అప్పట్లో 49.95 శాతం అంటే దాదాపు 50శాతం ఓట్లు దక్కాయి. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగా.. 5.53 శాతం ఓట్లతో జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే, అప్పట్లో జనమంతా ఏకపక్షంగా ఓటేసినట్లు, చంద్రబాబును దారుణంగా తిరస్కరించినట్లు వ్యాఖ్యానించింది. 

ఇప్పుడు.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 45.60 శాతం ఓట్లతో 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 6.85 శాతం ఓట్లతో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, 2.83 శాతం ఓట్లతో భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అంటే 55 శాతంపైగా ఓట్లను కూటమే గెలుచుకుంది. అయినా కూటమి విజయాన్ని విజయంగా వైసీపీ ఒప్పుకోవడం లేదు.

గత ఎన్నికల్లో దాదాపు 50శాతం ఓట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి 39 శాతానికి పడిపోయింది. అయితే, దీన్ని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అనడం లేదు. అలా అంటే ఒప్పుకోవడం లేదు జగన్‌, ఆయన పార్టీ నాయకులు. ‘‘మంచి చేసినా ఓడిపోయాం.. చంద్రబాబు మాయలో జనం పడిపోయారు. మాపైనే ఇంకా ప్రజలకు నమ్మకం ఉంది.’’ అని అంటున్నారు జగన్. జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చినా.. న్యాయంగా అయితే మేం ఓడిపోలేదంటున్నారు వైసీపీ వాళ్లు. 

అదేమంటే ఓ వింత వాదనను వినిపిస్తున్నారు. ‘‘40 శాతం ఓట్లతో మోదీ ప్రధాని అయ్యారు. 40 శాతం ఓట్లతో రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. అదే 40 శాతం ఓట్లు దక్కించుకున్న మాకు 11 సీట్లు రావడమేంటి. అసలు వైసీపీ ఓడిపోవడమేంటి..?’’ అని అడ్డంగా వాదిస్తున్నారు మాజీ మంత్రి రోజా లాంటి నాయకులు. 

పైగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై.. నెల రోజులు గడవక ముందే హామీలన్నీ అమలు చేయాలంటూ జగన్ మాట్లాడటంపై టీడీపీ వర్గాలు కౌంటర్ ఇచ్చాయి. జగన్ మళ్లీ జైలుకు పోయే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో జగన్ చేసినవన్నీ పాపాలేనని... ఐదేళ్లు చేసింది ఏమిలేదు కానీ 21 రోజులకే అన్నీ చేయాలంటూ వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios