ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని, మళ్లీ తానే సీఎం కావాలని వారు కోరుకుంటున్నారని  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో బహిరంగ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జగన్ వి చిల్లర రాజకీయాలంటూ మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగి... జగన్ సీఎం అయ్యారని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీకి గట్టిపునాది వేశారని.. ఇది తెలుగు జాతి ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. ఖజానాలో డబ్బుల్లేవని చెబుతూనే.. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని జగన్ చెప్పగానే...నమ్మి ప్రజలు ఓట్లు వేశారని... ఇప్పుడు ఓట్లు వేసినవాళ్లే బాధపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.  మళ్లీ తానే అధికారంలోకి రావాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడగగానే ప్రజలు నమ్మి ఓట్లు వేశారని... కానీ... ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే సామర్థ్యం జగన్ దగ్గర లేవని పేర్కొన్నారు. టీడీపీకి తమ కార్యకర్తలే వెన్నుముక అని చంద్రబాబు తెలిపారు. అలాంటి కార్యకర్తలను వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోమన్నారు.  ప్రాణాలకు తెగించి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తాము గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ వైసీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని తేల్చిచెప్పారు. తాము తలుచుకుంటే.... ఒక్క వైసీపీ కార్యకర్త కూడా మిగిలేవాడు కాదన్నారు.

ఖబడ్దార్‌ జగన్మోహన్‌రెడ్డీ.. పులివెందుల పంచాయతీల మాదిరిగా తోక జాడిస్తే.. కత్తిరిస్తామన్నారు.  జగన్‌కు శాడిస్టు అనే పదం చాలదని..జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.  నడిరోడ్డుపై నన్ను ఉరితీయాలన్న జగన్‌ వ్యాఖ్యలు పోలీసులకు వినపడలేదా? అని పోలీసులను ప్రశ్నించారు.

  ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి ఇదేమైనా వారి అబ్బసొత్తా? అని ప్రశ్నించారు.  అఖిలప్రియ ఇంటిలో సెర్చ్‌ వారెంట్‌ లేకుండా ఎలా  తనిఖీలు చేశారని అడిగారు.  కోడెలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపించారు.  వైసీపీ వేధింపులకు ప్రాణాలు పోతుంటే ప్రశ్నించడం తప్పా? డీజీపీ స్థాయి అధికారి షో చేస్తున్నామనడం సరైన పద్ధతేనా?  అని పోలీసులను ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్‌కు అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలన్నారు.  వైఎస్‌ వివేకా హత్య గురించి మాట్లాడకూడదని చెబుతున్నారన్నారు.  14 ఏళ్లు సీఎంగా చేసిన నాకు డీజీపీ చట్టాల గురించి చెబుతున్నారని మండిపడ్డారు. 

అనంతరం టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేయడంలోనే ఎక్కువగా గడిపానన్నారు.  దీంతో కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోయానని చెప్పారు.  ఇక నుంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కార్యకర్తలతోనే గడుపుతానని చెప్పారు. యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామన్నారు. టీడీపీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదన్నారు. ఒకరు వెళ్తే వందమంది నాయకులు పుడతారని చెప్పారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ చిరస్థాయిగా ఉంటుందన్నారు.