కర్నూలు : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ ఏపీలోనూ కలకలం రేపుతోంది. తెలంగాణలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో ఏపీలోని ఈఎస్ఐ ఆస్పత్రుల పనితీరుపై కూడా ఆరా తీయగా రాయలసీమ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పరిధిలో భారీగా అక్రమాలు జరిగినట్లు సమాచారం. 

ఈ పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కర్నూలు జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ లో దాడులు చేశారు. జిల్లాలోని ఆరు డిస్పెన్షరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను తనిఖీలు చేశారు. 

ఈఎస్ఐ డిస్పెన్షరీలలో నాలుగు నెలల మెడిసిన్స్ సప్లై చేయాల్సి ఉండగా కేవలం ఒక నెల మందులను సప్లై చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వాహకులు కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటలమాడుకుంటున్నారు. 

ఈ ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ తిరమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బృందాలు రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ పరిధిలోని డిస్పెన్షరీలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జ  

అయితే ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చి అక్రమాల చిట్టా విప్పనున్నారు అధికారులు.