గురజాల అభివృద్ధిపై చర్చకు కాసు 'సై':10 రోజుల తర్వాత డేట్ ప్రకటిస్తానన్న యరపతినేని,ఉద్రిక్తత
పల్నాడు జిల్లాలోని గురజాల లో అభివృద్దిపై చర్చకు విషయమై టీడీపీ,వైసీపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. చర్చ కోసం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. 10 రోజుల తర్వాత చర్చ జరిగే తేదీని ప్రకటించనున్నట్టుగా టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రకటించారు.
గుంటూరు:పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్దిపై టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లు, పత్రి సవాళ్లతో ఆదివరంనాడు ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కాకుండా మరో 10 రోజుల్లో అభివృద్దిపైచర్చకు తేదీని ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ రోజున చర్చకు రావాలని కోరారు. మరో వైపు ఇవాళ చర్చకువస్తానని ప్రకటించినట్టుగానే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాలకు వచ్చారు.టీడీపీ సహా ఏ పార్టీ వారైనా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఆదివారం పేరుతో టీడీపీ నేతలు చర్చ నుండి దూరంగా పారిపోయారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు.
గురజాల అసెంబ్లీ నియోజకర్గంలో తాను ఎమ్మెల్యేగాఉన్న సమయంలోనే రూ.1500 కోట్ల అభివృద్ది పనులు జరిగాయని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు.ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ది లేదన్నారు.కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నారని యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన, తర్వాత నియోజకవర్గంలో రూ. 400 కోట్లకుపైగా అభివృద్ది పనులు చేపట్టినట్టుగా కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు.
నియోజకవర్గంలో ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్దమని కాసు మహేష్ రెడ్డి మూడు రోజుల క్రితం ప్రకటించారు.ఆదివారంనాడు చర్చకు తాను సిద్దంగా ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్చకు తాను కూడా సిద్దమేనని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రకటించారు. అభివృద్ధిపై చర్చ ఆట విడుపు కారాదని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రకటించారు.10 రోజుల్లో మరో తేదీని ప్రకటించనున్నట్టుగా తెలిపారు. ముందుగా ప్రకటించినట్టుగానే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇవాళ గురజాల గెస్ట్ హౌస్‌కి చేరకున్నారు.చర్చకు ఎవరైనా రావాలని ఆయన సవాల్ విసిరారు.
గతంలో కూడ వీరిద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. గురజాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన శ్రేణులపై దాడులు,హత్యల విషయమై వైసీపీ పై యరపతినేని శ్రీనివాసరావు వైసీపీపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.