దేవాదాయశాఖలో అధికారుల మధ్య గొడవ: డీసీపై ఇసుక, మట్టిపోసిన ఏసీ శాంతి
విశాఖపట్టణంలోని దేవాదాయశాఖ డీసీ పుష్పవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక, మట్టి కొట్టింది. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన కారణంగానే ఈ పనిచేశానని శాంతి ఆరోపించింది.
విశాఖపట్టణం: దేవాదాయశాఖలోని ఇద్దరు అధికారుల మధ్య విబేధాలు నెలకొన్నాయి. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక, దుమ్ము కొట్టారు. విశాఖలోని తన కార్యాలయంలో పుష్పవర్ధన్ తన ఛాంబర్ లో కూర్చొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
గురువారం నాడు తన కార్యాలయంలో విధులు నిర్వహించుకొంటున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చి తనపై ఇసుక, దుమ్ము కొట్టి వెళ్లారని డీసీ పుష్పవర్ధన్ చెప్పారు. తనను నోటికొచ్చినట్టుగా తిట్టారని ఆయన ఆరోపించారు. సింహాచలం, మాన్సాస్ భూములపై డీసీ పుష్పవర్ధన్ విచారణ చేస్తున్నారు.
అయితే ఈ విషయమై అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియాతో మాట్లాడారు. తనను మానసికంగా డీసీ పుష్పవర్ధన్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.ఈ విషయమై తాను దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు కూడ ఫిర్యాదు చేశామన్నారు.తమపై అధికారులు విచారణకు రావాలని ఆదేశిస్తే తాను వెళ్లినా డీసీ పుష్పవర్ధన్ రాలేదన్నారు.
తన లాయర్ ద్వారా ఆర్‌జేసీకి డీసీ పుష్పవర్ధన్ నోటీసులు పంపారన్నారు. తన పరిధిలోని దేవాలయాల విషయంలో మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నాడని ఆమె ఆరోపించారు.తనకు భర్త, పిల్లలున్నారని తనను మానసికంగా ఇబ్బందులు పెట్టేలా డీసీ వ్యవహరిస్తున్నాడన్నారు. ఏం చేయలేని పరిస్థితిలోనే తాను ఇసుక, మట్టిని డీసీపై వేసినట్టుగా ఆమె చెప్పారు.