చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట పరువు హత్య నేపథ్యంలో దళిత సంఘాల ఆందోళన విరమించారు. పరువు హత్యను నిరసిస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

భార్యను కోల్పోయిన కేశవులు, తల్లిని కోల్పోయిన పసికందుకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని దళిత సంఘాలు హెచ్చరించాయి. కేశవులకు న్యాయం జరిగే వరకు ఆంందోళనలేదని రోడ్డెక్కడంతో సబ్ కలెక్టర్ కీర్తి చర్చలకు దిగొచ్చారు.

మృతురాలి భర్త కేశవుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మృతురాలి చంటిబిడ్డకు రూ.5లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగే కేశవులకు కాంట్రాక్ట్ ఉద్యోగం, భాస్కర్ నాయుడు ఆస్తిలో కుమార్తె హైమావతికి వాటా వచ్చేలా చూస్తానని సబ్ కలెక్టర్ కీర్తి హామీ ఇచ్చారు. అంతేకాదు కేసును ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో దళిత సంఘాల నేతలు ఆందోళన విరమించారు. 

ఇకపోతే ఊసరపెంట గ్రామానికి చెందిన భాస్కరనాయుడు కుమార్తె హైమావతి, స్థానికంగా ఉంటున్న కేశవులను ప్రేమించింది. రెండేళ్ల కిందట వారిరివురు వివాహం చేసుకుని వేరోచోట కాపురం చేస్తున్నారు. 

దళితుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో చంపేస్తానని కుమార్తె హైమావతిని తండ్రి భాస్కర నాయుడు ఆనాడే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భయపడ్డ ఆజంట వేర్వేరు ప్రాంతాల్లో రెండేళ్లపాటు తలదాచుకుంది. 

అయితే హైమావతి గర్భిణీ కావడంతో డెలివరీ నిమిత్తం ఊసరపెంట వచ్చింది. ఈనెల 22న పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ నుంచి భర్తతో కలిసి అత్తింటికి వచ్చింది. 

తన కుమార్తె దళితవాడలో ఉండటం పరువు తక్కువగా భావించిన భాస్కర్ నాయుడు కుటుంబం పగతో రగిలిపోయింది. అస్వస్థతో ఉన్న పురిటిబిడ్డకు చికిత్స నిమిత్తం శుక్రవారం హైమావతి, కేశవులు పలమనేరు తీసుకు వెళ్లారు. 

పలమనేరు వెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న భాస్కర్ నాయుడు కుటుంబం గ్రామశివార్లలో మాటువేసింది. బిడ్డతో బస్సుదిగి వస్తున్న దంపతులపై దాడి చేసిన భాస్కర్ నాయుడు కుటుంబం ఆ తర్వాత బలవంతంగా ద్విచక్రవాహనంపై హైమావతిని తీసుకువెళ్లిపోయారు. 

హైమావతిని చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత చంపేశాడు భాస్కర్ నాయుడు. మృతదేహాన్ని పాడైన బావిలో పడేసి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.