పెదనందిపాడులో కుక్క స్వైరవిహారం... కనిపించిన వారినల్లా కాటేస్తూ బీభత్సం (వీడియో)
గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో ఓ కుక్క పిచ్చిపట్టినట్లు వ్యవహరించింది. కనిపించిన వారినల్లా వెంటపడి కరుస్తూ భయానక వాతావరణం సృష్టించింది.

గుంటూరు : మంగళవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. ఎక్కడినుండి వచ్చిందో ఏమోగాని మనుషులు కనిపించడమే పాపం... వెంటపడి మరీ కరిచింది. ఇలా ఏకంగా ఎనిమిది మందిని కాటేసింది. అంతేకాదు రెండు పశువులు కూడా ఈ కుక్కకాటుకు గురయ్యాయి.
కుక్కకాటుకు గురయినవారిని కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొందరు మరీ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ కు తరలించారు.
కుక్క దాడితో పెదనందిపాడు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ళలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వెంటనే గ్రామంలో కుక్కల బెడద లేకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.
వీడియో
అయితే ఇలా ఎనిమిది మంది గ్రామస్తులపై కుక్క దాడిచేయడంపై పెదనందిపాడి సర్పంచ్ దాసరి పద్మారావు విచారం వ్యక్తం చేసారు. ఐదు రోజుల క్రితమే గ్రామంలోని వీధికుక్కలను పట్టించడం జరిగిందని ఆయన తెలిపారు. తాజాగా దాడికి పాల్పడిన కుక్క ఎక్కడినుండి వచ్చిందో అర్థం కావడంలేదని అన్నారు. ఈ కుక్కను కూడా పట్టించనున్నట్లు పెదనందిపాడు సర్పంచ్ తెలిపారు.