విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. 

వివరాల్లోకి వెళ్తే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల ఫలితాలు అనంతరం మే 23న వైయస్ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయనిర్మల వెలగపూడి రామకృష్ణబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మే 23 రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా వెలగపూడి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘింస్తూ ర్యాలీ చేపట్టారని అంతేకాకుండా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ను దూషించారంటూ ఆధారాలతో సహా ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్‌ నంబర్‌ 158/19తో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు. 

దీంతో బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. వెలగపూడి రామకృష్ణబాబును అరెస్ట్ చూపించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. అందుకు తనపై పెట్టిన కేసే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.