Asianet News TeluguAsianet News Telugu

రాయపాటిపై ఈడీ కేసు: బంగారు చీర విరాళంపై సిబిఐ ఆరా

రాయపాటి సాంబశివ రావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిదుల మళ్లింపు ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసింది. కాగా, పద్మావతి అమ్మవారికి చెరుకూరి శ్రీధర్ బంగారు చీర విరాళంగా ఇచ్చిన విషయంపై సీబీఐ దృష్టి పెట్టింది.

ED books case on Rayapati Sambasiva Rao
Author
Hyderabad, First Published Jan 3, 2020, 10:28 AM IST

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నాయకుడు రాయపాటి సాంబశివ రావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. నిధుల మళ్లింపుపై ఫెమా చట్టం కింద ఈ కేసు నమోదైంది.

రాయపాటి సాంబశివరావు దాదాపు 16 కోట్ల రూపాయలను సింగపూర్, మలేషియాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. రాయపాటిపైనా, ట్రాన్స్ ట్రాయ్ పైనా ఈడీ కేసులు నమోదయ్యాయి. 15 బ్యాంకుల నుంచి రూ.3882 కోట్లు రుణాలు తీసుకున్నట్లు, ఆ డబ్బులను మలేషియా, సింగపూర్, రష్యాలకు తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు 

అదే సమయంలో రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ అర్థిక లావాదేవీలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై దృష్టి పెట్టింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీలపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో నిధులు చెల్లించడం లేదంటూ 2015లోనే బ్యాంకుల కన్సార్షియం ఆ సంస్థ ఖాతను ఎన్ పీఏగా ప్రకటించింది. అంటే నాన్ ఫెర్మార్మింగ్ అసెట్ - నిరర్థక ఖాతాగా ప్రకటించింది. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సిబిఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదుపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ చేరుకూరి శ్రీధర్ ఇచ్చిన విరాళాలపై సిబిఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 2012 నవంబర్ 17వవ తేదీన తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు ఈ బంగారు చీర తయారీకి 8 కిలోల బంగారం, 879.438 గ్రామాల వజ్రాలు, పగడాలు వాడారు. 

2013 డిసెంబర్ 5వ తేదీన తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై సిబిఐ ఆరా తీస్తోంది. ఈ సంస్థ ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన ఐటి రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios