వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ  జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా... ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది.

జెల్లా జగన్మోహన్ రెడ్డికి... వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఆయన ద్వారా కడప జిల్లాలో భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని.. ఇందుకోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగానే.. అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో కడప జిల్లా కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో రూ.15.22లక్షల విలువైన 27ఎకరాల పొలం, మణికొండ ల్యాంకోహిల్స్ లోని రూ.1.30కోట్ల విలువైన ఇల్లు, మొత్తం రూ.1,45,45,799విలువైన ఆస్తులను ఈడీ  జప్తు చేసింది. దీనిని సవాలు చేస్తే జెల్లా జగన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించారు. 

ఆయన వాదనను విన్న ట్రైబ్యునల్... ఈడీ అభియోగాలను తిరస్కరించింది. అంతేకాకుండా జెల్లా జగన్ ది అక్రమాస్తి కాదని.. దానిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.