రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా  మారేడుమిల్లి వద్ద మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి  చేరుకొంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుగ్గర జిల్లాకు చెందిన చెర్లకేళి గ్రామానికి చెందిన 24 మంది ప్రైవేట్ వాహనంలో తూర్పు గోదావరి జిల్లా అన్నవరంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

సోమవారం నాడు ఉదయం కర్ణాటక నుండి వీరంతా రెండు టెంపో వాహనాల్లో అన్నవరం బయలుదేరారు. నిన్న సాయంత్రం భద్రాచలానికి చేరుకొన్నారు. ఇవాళ ఉదయం  భద్రాచలంలో శ్రీరాముడిని దర్శించుకొన్నారు. భద్రాచలం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

భద్రాచలం నుండి అన్నవరంకు వెళ్తున్న సమయంలో మొదటి టెంపో వాహనం సురక్షితంగా వాల్మీకి కొండ దాటింది. వెనుక వచ్చే టెంపో వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి  లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన మొదటి వ్యాన్ లోని పర్యాటకులు ప్రమాదస్థలానికి చేరుకొన్నారు. భద్రాచలం నుండి వస్తున్న మరో వాహనం ద్వారా మారేడుమిల్లికి చేరుకొని  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలంలోనే  పోలీసులు చేరుకొని  సహాయక చర్యలు చేపట్టారు. ఓ వివాహన్ని పురస్కరించుకొని కర్ణాటకకు చెందిన వీరంతా అన్నవరం వెళ్తున్నారు.