విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గగుడిలో మరో వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో దుర్గగుడి పాలకమండలిలో కొందరు రాజీనామా చేసింది. 

ఈనెల 25న పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుతోపాటు 9 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆలయ ఈవో కోటేశ్వరమ్మకు అందజేశారు. మెుత్తం 15 మంది సభ్యులతో ఉన్న కమిటీలో మరో ఐదుగురు రాజీనామా చేయలేదు. 

దుర్గ గుడి పాలకమండలి పదవీకాలం జూన్ 30 వరకు ఉండటంతో ఆ ఐదుగురు రాజీనామా చేయకుండా ఉన్నారు. అయితే చైర్మన్ తోపాటు అత్యధికంగా పదిమంది రాజీనామా చేయడంతో దుర్గగుడి ఈవో చైర్మన్ గౌరంగబాబు కార్యాలయానికి, పాలకమండలి కార్యాలయానికి తాళం వేశారు. 

కొందరు రాజీనామా చేయడం మరికొందరు రాజీనామా చేసేందుకు వెనుకాడుతుండటంతో దుర్గ గుడి మరోసారి వివాదంలోకి వచ్చింది. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతోపాటు కొత్త ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో ఇటీవలే దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ వైయస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. దుర్గ గుడి ఆలయ అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జగన్ ను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.