Asianet News TeluguAsianet News Telugu

దుగ్గిరాలలో కొనసాగుతున్న సస్పెన్స్: మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా.. ‘‘కింగ్‌మేకర్‌’’గా జనసేన సభ్యుడు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. వరుసగా రెండో రోజు ఎంపీపీ ఎన్నికకు సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. 
 

duggirala mpp election postponed
Author
Duggirala, First Published Sep 25, 2021, 7:46 PM IST

పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో మంచి జోష్ మీదున్న అధికార వైసీపీకి... ఎంపీపీల ఎన్నిక మాత్రం ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండలపరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో పలుచోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించినా, అసమ్మతివర్గాలు ఎదురుతిరిగాయి. దీంతో ఎమ్మెల్యేలు నిర్ణయించినవారు కాకుండా, వేరే అభ్యర్థులు మండలపరిషత్‌ అధ్యక్షులయ్యారు. అధికార పార్టీలోని రెండువర్గాల మధ్య అక్కడక్కడ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీరికి అక్కడక్కడ టీడీపీ, జనసేన, స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. 

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. వరుసగా రెండో రోజు ఎంపీపీ ఎన్నికకు సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. వరుసగా రెండోసారి కోరం లేనందున తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలియజేస్తామని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన తేదీ ప్రకారం మళ్లీ ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా దుగ్గిరాల మండల పరిషత్‌ పీఠం వైసీపీ కైవసం చేసుకుంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read:ఏపీలో ప్రశాంతంగా జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక: విశాఖలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం..

మరోవైపు ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకుకోవాలని అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మండలంలో టీడీపీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది. అయితే ఆ పార్టీ ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీనాకు కుల ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దుగ్గిరాల మండలంలో అధికార వైసీపీ 8, జనసేనకు 1, టీడీపీకి 9 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఎంపీపీ ఎన్నిక జరగాలంటే కనీసం 9 మంది ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. టీడీపీ సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికకు జనసేన ఎంపీటీసీ సభ్యుడి ఓటు కీలకం కానుంది.  

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 649 మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు ప్రారంభించగా.. వాటిలో 15 అధ్యక్ష, 30 ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 624, టీడీపీ 7, జనసేన, సీపీఎం చెరో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఈ స్వతంత్ర అభ్యర్థి తెలుగుదేశంలో చేరినట్లు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios