విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని అప్పుగర్‌ ప్రాంతంలో ఓ పోలీస్ అధికారి అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవర్మ శుక్రవారం మధ్యాహ్నంలో నగరంలోని తన నివాసంలో మరణించారు.

ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు లంగ్ క్యాన్సర్ కూడా ఉందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కృష్ణవర్మ ఇటీవలికాలంలో తీవ్రమైన మనో వేదనకు గురైనట్లుగా సమాచారం.

గత కొద్దిరోజులుగా సెలవులో ఉన్న ఆయన శుక్రవారం ఆయన భార్యాపిల్లలు ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి కృష్ణవర్మ ఇంట్లో ఆపస్మారక స్ధితిలో పడివున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.