అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధేయతకు పట్టం కడుతున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వెంట నడిచినవారిని గుర్తు పెట్టుకుని మరీ వారికి పదవులు ఇస్తున్నారు. పిల్లల వైద్యుడు హరికృష్ణను జగన్ సీఎం కార్యాలయంలో స్పెషలాఫీసర్‌గా నియమించుకున్నారు. 

గతంలో అనంతపురం జిల్లాలోని మండల కేంద్రమైన కొత్తచెరువులో డాక్టర్ హరికృష్ణ పిల్లల క్లినిక్‌ను స్థాపించారు. అయితే,  వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో జగన్ కుటుంబం వెంట ఆయనను నడిపించింది. పాదయాత్రలు చేసినప్పుడు షర్మిలతో 3,112 కిలో మీటర్లు, వైఎస్‌ జగన్‌తో 3,648 కిలోమీటర్లు ఆయన నడిచారు.
 
జగన్‌ వెంట నడుస్తూ ప్రజలు జగన్‌కు సమర్పించే వినతులను హరికృష్ణ స్వీకరిస్తుండేవారు. జగన్‌ సూచనతో ఎంతో మందికి ఆయన వైద్య సేవలు అందించారు. ప్రతి నిత్యం వైఎస్‌ జగన్‌కు అందుబాటులో ఉంటూ ముఖ్యమైన సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేవారు. తనతో పాటు కష్టపడిన హరికృష్ణను జగన్ తన ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషలాఫీసర్‌గా నియమించుకున్నారు.