Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ సుధాకర్ ను లాగే: తెరపైకి ఏపీలో దళిత మహిళా డాక్టర్ వివాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళా డాక్టర్ వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అనితా రాణి ఆరోపించారు.

Dr Anitha Rani alleges she was harassed by YCP leaders
Author
Chittoor, First Published Jun 8, 2020, 3:20 PM IST

చిత్తూరు: తనను వైఎస్సార్ కాంగ్రెసు నేతలు వేధిస్తున్నారని దళిత వైద్యురాలు డాక్టర్ అనితా రాణి చేసిన ఆరోపణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. డాక్టర్ అనితా రాణి వాయిస్ రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సుధాకర్ ను వేదించినట్లే తనను కూడా వేధిస్తున్నారని చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అనితా రాణి ఆరోపించారు. 

తన గోడును ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితకు ఫోన్ లో వెల్లబోసుకున్నారు. పెనుమూరు డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం కావడంతో మరింత దుమారం చెలరేగుతోంది. తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారని, తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. బాత్రూంలో తన ఫొటోలు కూడా తీశారని ఆమె ఆరోపించారు. మార్చి 22వ తేదీన తనను వేధించారని అనితా రాణి ఫిర్యాదు చేశారు.

అయితే, అనితారాణి వ్యవహారంపై డీహెచ్ఎంవో రమాదేవి నివేదిక ఇచ్చారు. అనితా రాణిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, ఆమె విధులు సరిగా నిర్వహించరని డిఎంహెచ్ఓ అన్నారు. వైద్యం కోసం వచ్చిన పిల్లలను కొడుతున్నారని అన్నారు. వైద్యం సరిగా చేయదని ఆరోపించారు. 

చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. నిజాయితీగా వృత్థి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ, ఫొటోలు తీసినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios