అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ విప్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిప్పులు చెరిగారు. దేశానికి దెయ్యంలా నరేంద్రమోదీ దాపురించారంటూ మండిపడ్డారు. దేశానికి పట్టిన ఆ మోదీ దయ్యాన్ని వదిలించేందుకే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని చెప్పుకొచ్చారు. 

దేశంలోని అన్ని పక్షాలు ఏకమై బీజేపీకి ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని డొక్కా పిలుపునిచ్చారు. దేశాన్ని, ప్రజాస్వామ్యన్నీ రక్షించాలన్నదే తమ నినాదమని ఆయన స్పష్టం చేశారు. దేశభక్తి అని చెప్పుకుని తిరిగే బీజేపీ రాఫెల్ కుంభకోణంతో దేశ భద్రతను అమ్మేసుకుందని విమర్శించారు.

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేతకు పదవులు కాదు ముఖ్యం దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇప్పటికే బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు