ఓ హత్య కేసులో లంచం తీసుకుని కేసును తారుమారు చేయాలనుకున్న పోలీసుల ప్రయత్నాన్ని వీధికుక్కలు బయటపెట్టాయి. ఎలాగంటే..
అమరావతి : వీధికుక్కలు హత్య కేసును ఛేదించాయి. ఇద్దరు అవినీతిపరులైన పోలీసు అధికారులను పట్టించేందుకు కారణమయ్యాయి. హత్యకేసును తారుమారు చేసేందుకు భారీగా లంచం తీసుకున్న ఇద్దరు పోలీసు అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పమిడిముక్కల సీఐ మేడికొండూరు ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్ఐ యాదగిరి అర్జున్ లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ విషయాన్ని డిజిపి రాజేంద్రనాథ్రెడ్డి విలేకరులకు తెలిపారు. వీరికి డీఐజీ నుంచి శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు అందనున్నాయని తెలిసింది.
అసలేం జరిగిందంటే..
2022 జూలై 26న తోట్లవల్లూరు మండలం ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో వివాహేతర సంబంధం హత్యకు కారణంగా తేలింది. దీనిలో ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావించారు. ఈ విషయాలు వెలుగులోకి వస్తే తన కుటుంబం పరువు పోతుంది అనుకున్న శ్రీకాంత్ రెడ్డి.. అధికార పార్టీకి చెందిన నరేంద్ర రెడ్డిని ఆశ్రయించారు. సుమారు రూ.1.50కోట్లు ఖర్చు అవుతుందని నిందితుల కుటుంబంతో నరేందర్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు.
చదవుకోనివ్వకుండా పెళ్లి చేసేస్తారని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..
సిఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ ను సంప్రదించారు. ఎస్సైకి రూ.1.60 లక్షలు, సీఐకి రూ.12.50 లక్షలు నరేందర్రెడ్డి అందజేశారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, అతని కుటుంబసభ్యులను నిందితులుగా చేర్చకుండా తప్పించేందుకు సీఐ ఏర్పాటు చేశారు. ఈ డీల్ గురించి తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంకి చెందిన అధికార పార్టీ నేత పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. తానైతే ఇంకా తక్కువ మొత్తానికే తీర్చుకునే వాడినే కుటుంబంతో అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి అదృశ్యం..
తోట్లవల్లూరు మండలంలో మధ్యవర్తిత్వ కేసుల్లో పుచ్చకాయల శ్రీనివాస్ రెడ్డికి, నరేంద్ర రెడ్డికి మధ్య వైరం నడుస్తోంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని నరేందర్రెడ్డి నిర్ణయించారు. డీల్ విషయం మాట్లాడాలి అని పిలిపించుకుని.. ప్రణాళిక ప్రకారం హత్య చేశారు. శవాన్ని ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బల్లిపర్రు వద్ద పూడ్చేశారు. పుచ్చకాయల శ్రీనివాస్ రెడ్డి కనిపించడం లేదని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 23న కేసు నమోదయ్యింది.
పాతిపెట్టిన శవాన్ని కుక్కలు పీక్కు తింటుండగా చేతులు బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత విషయం తెలిసి హత్యకేసులో నరేంద్ర రెడ్డిని సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులోనే తోట్లవల్లూరు హత్య కేసులో పోలీసులకు లంచం ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆధారాలు సేకరించి శుక్రవారం ముక్తేశ్వరరావు, ఎస్సై అర్జున్ లను అరెస్టు చేశారు.
