ఒంగోలు: ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది.ఈ ఘటనపై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.  సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలోని బిట్రగుంటకు చెందిన కాంతారావు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఒంగోలు లోని  రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రిమ్స్ లో బెడ్స్ లేవని ఆసుపత్రి సిబ్బంది ఆయనను చేర్చుకోలేదు. ఆసుపత్రి ఆవరణలోనే ఆయన రెండు రోజుల పాటు ఉన్నాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందులతో కాంతారావు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అంతేకాదు ఆసుపత్రి ఆవరణలోనే ఆయన మృతి చెందాడు.

కాంతారావు మరణించిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. కాంతారావు మృతదేహన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో అప్పటికప్పుడు డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి బంధువులు, ప్రజా సంఘాలు ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటన మీడియాలో రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్ అయింది. ద్విసభ్య కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటి సభ్యులు బుధవారంనాడు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.