తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి స్పందించని  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్... ఓ బూతు డైరెక్టర్ గురించి స్పందించడం చాలా సిగ్గుచేటని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దివ్యవాని.. డైరెక్టర్ వర్మని అడ్డుకుని పోలీసులు మంచి పని చేశారన్నారు. వర్మకి దమ్ముంటే జగన్ ఇంట జరిగిన హత్యారాజకీయాలపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. అనంతరం లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రపై కూడా ఆమె స్పందించారు.

లక్ష్మీపార్వతి ఏమిటో దేశం మొత్తానికి తెలుసని దివ్యవాణి అన్నారు. ఎన్టీఆర్‌కు స్టెరాయిడ్స్ ఇచ్చి చంపిన చరిత్ర లక్ష్మీపార్వతిది అని దివ్యవాణి ఆరోపించారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఒక విషపు చుక్క అని విమర్శించారు. లక్ష్మీపార్వతి గురించి ఆమె మొదటి భర్త వీరగంథం సుబ్బారావు ఎప్పుడో చెప్పారని, వర్మ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. డైరెక్టర్ వర్మ వెనుక జగన్, విజయసాయిరెడ్డి ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు.