Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్ర వైసీపీలో రగులుతున్న కుంపట్లు.. ‘‘మంత్రి’’ పదవిపై ఆశ, సొంతపార్టీ నేతలే ప్రత్యర్ధులు

ఉత్తరాంధ్ర వైసీపీలో నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయి. పదవుల చుట్టూ రాజుకున్న పంచాయితీలు వ్యక్తిగత ప్రతిష్టను సైతం పణంగా పెట్టే స్థాయికి వెళ్లిపోయాయి. రోడ్డెక్కి రాజకీయం చేయకపోయినా నేతలు మాత్రం కౌగిలించుకుని కత్తులు దూసుకుంటున్నారు. 

disputes in uttarandhra ysrcp leaders
Author
Visakhapatnam, First Published Sep 22, 2021, 7:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉత్తరాంధ్ర వైసీపీలో నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయి. పదవుల చుట్టూ రాజుకున్న పంచాయితీలు వ్యక్తిగత ప్రతిష్టను సైతం పణంగా పెట్టే స్థాయికి వెళ్లిపోయాయి. రోడ్డెక్కి రాజకీయం చేయకపోయినా నేతలు మాత్రం కౌగిలించుకుని కత్తులు దూసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగానే వుంటాయి. ఒకప్పుడు టీడీపీ కంచుకోట బద్ధలవ్వగా.. సీనియర్లు ఎక్కువ మంది ఉండటంతో వైసీపీ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా నేతి బీరకాయ వ్యవహారం మాత్రమేనని అంతర్గత రాజకీయాలు గమనిస్తే బోధపడుతుంది.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు కృష్ణదాస్, అప్పలరాజు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రధాన రాజకీయ వర్గాలు. ఇక్కడి నేతలు ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోరు. దీంతో ద్వితీయ శ్రేణి అసంతృప్తి మినహా ఇక్కడ వర్గపోరు ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైంది. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, సీనియర్ నేత నర్సీ రామారావు మధ్య విబేధాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవమున్న రామారావు ఇక్కడ పటిష్టమైన నాయకుడిగా వున్నారు. ఆయన హవాకు చెక్ పెట్టేందుకు సాయిరాజ్ వర్గం నిరంతరం ప్రయత్నిస్తోంది. 

విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే కార్పోరేషన్ పరిధిలో వ్యవహారాలను మంత్రి బొత్స పట్టించుకోకపోవడంతో అంతర్గత ఎత్తుగడలు తప్ప బహిరంగ విబేధాలు కనిపించవు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో వున్న ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఉప్పు నిప్పులా వున్నారు. ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి పొరుగున వున్న ఎమ్మెల్యేలతో అస్సలు పొసగడం లేదు.

ప్రధానంగా సాలూరు ఎమ్మెల్యే పీడీక రాజన్న దొరతో పుష్ప శ్రీవాణికి వైరం వుంది. అలాగే  పాతపట్నం ఎమ్మెల్యే జోగారావుకు డిప్యూటీ సీఎంకు పొత్తు కుదరని పరిస్థితి. అయితే రాజన్న దొర సీనియర్ కాగా, జోగారావు యంగ్. మరి పుష్ప శ్రీవాణి తనను తాను ముఖ్యమంత్రి వర్గీయురాలిగా ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి మంత్రి పదవి రాజన్న దొరకు వస్తుందని అంచనా వేసుకున్నా అది సాధ్యం కాలేదు. అటు ఎస్ కోటలో కూడా రాజకీయం రచ్చకెక్కింది. మొదటి నుంచి కూడా ఇక్కడ రఘురాజు, షేక్ రెహ్మాన్ మధ్య విబేధాలున్నాయి. ఇద్దరిని కలుపుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే  కడుబండి శ్రీనివాసరావు ఇప్పుడు రఘరాజు వర్గానికి మద్ధతుగా నిలిచారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో వర్గం ఫైరవుతోంది. 

ఉత్తరాంధ్ర రాజకీయానికి గేట్‌వేగా చెప్పుకునే విశాఖలోనూ రాజకీయ కుంపటి రాజుకుంటోంది. మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్ మధ్య పొంతన కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పు జరిగితే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యేలు మంత్రితో దూరం పాటిస్తున్నారు. కనిపించినప్పుడు నోటితో పలకరించుకుని.. నొసటితో వెక్కిరించుకున్న పరిస్ధితి నెలకొంది.

ఇక అనకాపల్లిలో మూడు వర్గాలు నడుస్తున్నాయి. ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమరనాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మధ్య ఇక్కడ ప్రధానంగా రాజకీయం నడుస్తోంది. ఒకరంటే ఒకరికి అస్సలు పొసగదు. దీంతో రాజకీయం నివురుగప్పిన నిప్పులా వుంది. ఇక యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో డైరెక్ట్ ఫైట్ చేస్తున్నారు సీనియర్లు. ఇక్కడ బలమైన నాయకత్వం, సామాజిక బలం కలిగిన ఆడారి ఆనంద్ వర్గం అధిష్టానం సూచనలతో సర్దుబాటు రాజకీయం నడిపిస్తున్నా.. మనస్పూర్తిగా మాత్రం లేరు. దీంతో ఈ గ్రూపులు ఎంతకాలం కలిసిమెలిసి వుండటం సాధ్యమనే చర్చ స్థానిక నాయకత్వంలో వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios