దుర్గగుడిలో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. కీలక మీటింగ్‌కు అందని ఆహ్వానం, ఛైర్మన్ ఆగ్రహం
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇంతటి కీలకమైన సమావేశానికి తనను పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. దసరా కో ఆర్డినేషన్ మీటింగ్‌కు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌కు ఆహ్వానం అందకపోవడం కలకలం రేపుతోంది. దుర్గగుడి సమీపంలోని జమ్మిదొడ్డిలో జరిగిన కో ఆర్డినేషన్ మీటింగ్‌కు జిల్లా కలెక్టర్, సీపీ, ఈవో, దేవాదాయ శాఖ అధికారులు హాజరయ్యారు.
అయితే ఇంతటి కీలకమైన సమావేశానికి తనను పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తన ఛాంబర్‌లో పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని ఛైర్మన్, పాలక మండలి సభ్యులు స్పష్టం చేశారు. దసరా మీటింగ్ జరుగుతున్నట్లు తనకు సమాచారం ఇవ్వలేదని.. ఒక ఛైర్మన్‌గా తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదో ఈవోకే తెలియాలన్నారు.
ALso REad: బెజవాడ దుర్గగుడిలో అనూహ్య పరిణామాలు.. ఈవోగా కేఎస్ రామారావు , తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం
కాగా.. కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తక్షణమే విధులు స్వీకరించాలని సర్కార్ ఆయనను ఆదేశించింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్నారు రామారావు. అయితే తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్‌ను ఈవోగా నియమించింది. అయితే రోజులు గడుస్తున్నా ఆయన విధుల్లో చేరకపోవడంతో రామారావును ఈవోగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సరిగ్గా శరన్నవరాత్రులకు కొద్దిరోజుల ముందు ఈవో భ్రమరాంబ బదిలీ వ్యవహారం విజయవాడతో పాటు దేవాదాయ శాఖలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ బదిలీ వెనుక రాజకీయ కోణం వున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.