Asianet News TeluguAsianet News Telugu

డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్, ‘లక్ష్మీ’ వ్యవహారంలో ట్విస్టులే ట్విస్టులు.. రోజుకో వివాదం....

డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారంలో లక్ష్మి అనే మహిళ పాత్ర వివాదాస్పదంగా మారుతోంది. రోజుకో ట్విస్ట్  వెలుగులోకి వస్తోంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

Dismissed constable Prakash,'Lakshmi' twists and turns and Controversy in anantapur
Author
First Published Sep 10, 2022, 8:16 AM IST

అనంతపురం : కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించిన ప్రకాష్ వ్యవహారంలో మహిళ లక్ష్మి పాత్ర వివాదాస్పదమవుతోంది. తనను ప్రకాష్ వేధించాడంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి మాట మార్చిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ విషయం మీద శుక్రవారం ఆమె ఫిర్యాదు చేసేందుకు రావడం.. అదీ పోలీసులపైనే కేసు పెట్టడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెడితే...

కానిస్టేబుల్ ప్రకాష్ తన భార్య లక్ష్మిని లోబరుచుకున్నాడంటూ గార్లదిన్నెకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన వారిద్దరూ కలిసుండడం చూసిన ఆయన అడ్డకున్నట్లు తెలిసింది. గొడవ జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని మందలించి పంపారు.
 
అప్పటినుంచి కనిపించని లక్ష్మి సంఘటన జరిగిన 9 రోజుల తరువాత శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. తనను అనంతపురం టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్, భర్త వేణుగోపాల్ రెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు అంజినిరెడ్డి ఆ రోజు చంపాలని చూశారని పేర్కొంది. స్థానికులు రావడంతో ఎస్ఐతో పాటు అందరూ పరారయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.  

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 30న తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విధుల నుంచి తొలగించారని.. ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలిగా’ పేర్కొన్న బీ లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్ 14న  శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన స్పందన సభకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించి కానిస్టేబుల్ ప్రకాష్ ను విధుల్లో నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాష్ బంగారం,  డబ్బు తీసుకున్నారని అభియోగంపై అతని డిస్మిస్ చేస్తున్నట్లు అనంతపురం ఎస్పీ పకీరప్ప ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి మరుసటిరోజు అనంతపురం ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ప్రకాష్ తన నుంచి 30 తులాల బంగారం,  రూ.10 లక్షలు నగదు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డంపెట్టుకుని ఆయనను డిస్మిస్ చేశారని వాపోయారు.

ఏపీలో అధికారం, ఢిల్లీతో మాకెందుకు.. భారతమ్మకి అంత ఖర్మ పట్టలేదు: టీడీపీ నేతలకు కొడాలి నాని కౌంటర్

‘నా భర్త, అతని కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను. అక్కడున్న సీఎం వలి అనే కానిస్టేబుల్  నా ఫిర్యాదు చేస్తానని చెప్పి, నేను, నా భర్త వేధింపుల గురించి చెబితే అతను మరో లేఖ రాశాడు. కానిస్టేబుల్ ప్రకాష్ నన్ను వేధిస్తున్నట్లు,  అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లు గా రాసాడు. 

ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందర పెట్టి స్టేట్మెంట్ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నాడు. దాని ఆధారంగానే కేసు నమోదు చేసి అప్పటి డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కానిస్టేబుల్ ప్రకాష్ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డిఎస్పి ప్రెస్మీట్లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్  ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్నికోర్టులో తేల్చుకోవాలి అన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డిఎస్పి కి లీగల్ నోటీసులు ఇప్పించాను.

ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఇదేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్ ను డిస్మిస్ చేయడం అన్యాయం. డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత’ అని లక్ష్మి ఆవేదన చెందారు. ‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు,  జిల్లా ఎస్పీ ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాష్ పరిచయమయ్యాడు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్  సీఎం వలీ,  డీఎస్పీ వీరరాఘవ రెడ్డి  ఈ దుష్ప్రచారం చేశారు’  అని ఆమె ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios