జగన్ సర్కార్ 'ఎగ్ పఫ్స్' కోసం రూ.3.62 కోట్లు ఖర్చు పెట్టిందా? వైసీపీ vs టీడీపీ మాటల యుద్ధం
AP Egg Puff Scandal: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలో చేసిన ఖర్చులు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం 'ఎగ్ పఫ్స్' కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని టీడీపీ తీవ్ర విమర్శల మధ్య వైపాకా నాయకులు కూడా ఎదురుదాడికి దిగారు.
YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చులు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రభుత్వం జగన్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చుల వివరాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం తీవ్రస్థాయిలో కొనసాగిందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విషయాలు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా "ఎగ్ పఫ్స్" కోసం జగన్ సర్కారు చేసిన కోట్ల రూపాయల ఖర్చును టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇదే అంశం తీవ్ర దుమారం రేపుతోంది. వైకాపా-టీడీపీల రాజకీయ యుద్ధంలో ఇదే అంశం కేంద్ర బిందువుగా మారింది.
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారనీ, దీని ఖర్చు ఏటా రూ.72 లక్షలు కాగా, మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారని వివరాలను టీడీపీ నాయకులు పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అనే విషయాలను ప్రస్తావిస్తున్నారు.సోషల్ మీడియాలో టీడీపీ- వైకాపాలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం.. గత సర్కారు ఆర్థిక అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. "ఎగ్ పఫ్ స్కాండల్" గా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. ఇప్పటికే జగన్ పదవీకాలంలో ఆయన భద్రతపై అధిక వ్యయం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం తీవ్ర దుమారం రేపిన వివాదాలుగా ఉన్నాయి.
అధికార పార్టీ ఆరోపణలు, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శల మధ్య 'ఎగ్ పఫ్ స్కాండల్' మాజీ సీఎం జగన్, వైకాపాప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎగ్ పఫ్ అంశాన్ని 'ఫేక్ న్యూస్'గా అభివర్ణించారు. 2014-2019 మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లకు స్నాక్స్ కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.8.5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీ ఆరోపణలను టీడీపీ వెంటనే స్పందిస్తూ.. వైకాపా చేస్తున్న కామెంట్స్ నిరాధారమైనవి,కల్పితమైనవిగా అభివర్ణించింది. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక అవకతవకల వాస్తవ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్ఆర్సీపీ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.
ఈ తాజా వివాదంపై నెటిజన్ల స్పందన ఇది.. 👇