అమరావతి: సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

విజయవాడ విడిచి వెళ్లకూడదని హైకోర్టు ధూళిపాళ్లను ఆదేశించింది. అలాగే ఏసీబీ విచారణకు సహకరించాలని కూడా సూచించింది. ధూళిపాళ్ల విచారణకు 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. 

సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రతో పాటు గోపాలకృష్ణన్ అరెస్టయిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ కేసులో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేసారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ఏసీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబి అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.