ముుఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రావాలంటూ ఓ వ్యక్తిని వైసిపి నేత బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ భయటకు వచ్చింది. 

ధర్మవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకుంటే చెప్పుతో కొడతానంటూ ఓ వ్యక్తిని వైసిపి వైస్ ఎంపిపి బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పలలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరైన నేపథ్యంలో వైసిపి నాయకులు భారీ జనసమీకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే ధర్మవరంకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సీఎం సభకు రావాలంటూ ఓ సామాన్యుడిని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సీఎం జగన్ విద్యాదీవెన కార్యక్రమం జరిగిన రోజు ధర్మవరం వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి రావులచెరువు గ్రామానికి చెందిన వెంకటరాముడిని బెదిరించిన ఆడియో బయటకు వచ్చింది. సీఎం సభకు రాకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుకుంటున్న సొమ్మును చెప్పుతో కొట్టి వసూలు చేస్తానంటూ వైస్ ఎంపిపి హెచ్చరించాడు. ఈ ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

తనకు ఇళ్లు లేదని... ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయలేదని ఫోన్ చేసిన వైస్ ఎంపిపి కి వెంకటరాముడు తెలిపాడు. ఇళ్లు లేకపోవడంతో షెడ్డు వేసుకుని అందులో నివసిస్తున్నామని తెలిపాడు. ఈ ప్రభుత్వంలో తమకు ఏ సాయమూ అందలేదు... సీఎం సభకు ఎందుకు రావాలి? అని ప్రతాప్ రెడ్డిని వెంకటరాముడు నిలదీసాడు.

Read More జగన్ కాన్వాయ్‌ని అడ్డుకోవడం వెనుక కుట్ర : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

 అయితే వెంకటరాముడు మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురయిన ప్రతాప్ రెడ్డి బూతుపురాణం అందుకున్నాడు. మగ్గం లేకున్నా వైఎస్సాఆర్ చేనేత నేస్తం పథకం కింద లబ్దిపొందేలా సాయం చేయలేదా? ఇంకేం చేయాలి నీకు... భూములు రాసివ్వాలా? అంటూ మండిపడ్డారు. నార్పల సభకు రాకుంటే ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అందుకున్న డబ్బులను చెప్పుతో కొట్టి మరీ వసూలు చేస్తానని వైసిపి వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి రావులచెరువు వాసి వెంకటరాముడును బెదిరించిన ఆడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. 

ఇదిలావుంటే హెలికాప్టర్ లో సాంకేతిక కారణాలతో అనంతపురం జిల్లాలో విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాలో సీఎంకు నిరసన సెగ తగిలింది. పేదలకు ఇళ్ళ స్థలాల కోసం తమ భూములను సేకరించి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదంటూ తుంపర్తి, మోటుమర్రి గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. సీఎం కాన్వాయ్ ని అడ్డుకోడానికి వారు ప్రయత్నించగా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రోడ్డుపైకి వచ్చిన మహిళలు, రైతులను పక్కకు నెట్టేసారు.