దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద ఈ నెల 15వ తేదీన మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం సోమవారం నాటి నుండి వెలికి తీసే ప్రయత్నాలు చేయనున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ధర్మాడి సత్యానికి ఈ బాధ్యతను ఏపీ సర్కార్ అప్పగించింది.

గోదావరి నదిలో210 అడుగుల లోతులో ఉన్న రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు రూ.22.70 లక్షలకు ప్రభుత్వం సత్యానికి పనులను అప్పగించింది.బోటు వెలికితీసే బృందంలో ఉన్న ప్రతి ఒక్కరికి రిస్క్ కవరేజీని కూడ ప్రభుత్వం కల్పించింది.

నదిలోకి దిగకుండానే బోటు, పంటు మీద నుండి లంగర్లను నదిలోకి వదులుతారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీటిని వదిలి బోటు కోసం గాలింపు చర్యలు చేపడుతారు.

లంగరుకు బోటు తగిలిన వెంటనే ఆ రోప్ కు క్రేన్ ను అనుసంధానం చేసి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తారు.క్రేన్, ప్రొక్లెయినర్, బోటు, పంటు, 800 మీటర్ల వైర్ రోప్, రెండు లంగర్లతో పాటు ఇతర సామాగ్రిని బోటు వెలికితీత కోసం ఉపయోగిస్తారు.

ధర్మాడి సత్యంతో పాటు మరో 25 మంది మత్య్సకారులు బోటును వెలికితీసే కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ బోటు మునిగిన ప్రమాదంలో ఇప్పటికే 36 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 15 మృతదేహాలు బయటపడాల్సి ఉంది. వీరంతా బోటు క్యాబిన్ లోనే చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

బోటు మునిగిపోయిన ప్రాంతంలో దుర్వాసన వస్తోందని గాలింపు సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. బోటులోనే చిక్కుకొని మిగిలిన వారంతా మృత్యువాత పడినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. 

బోటును వెలికితీస్తే ఈ మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్నందున మృతదేహాలు  గుర్తుపట్టే పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

కచ్చులూరు బోటు ప్రమాదం: ప్రైవేట్ వ్యక్తి చేతికి బోటు వెలికితీత పనులు...