పశ్చిమగోదావరి జిల్లా శ్రీరామనవమి   వేడుకల్లో  చలువ పందిళ్లు   మంటలకు  దగ్దమయ్యాయి

ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకుంది. చలువ మందిళ్లకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం దువ్వలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల కోసం చలువ పందిళ్లు వేశారు. అయితే ఈ చలువ పందిళ్లకు గురువారంనాడు ఉదయం మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన భక్తులు వెంటనే చలువ పందిళ్ల కింద నుండి పక్కకు వెళ్లిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా చలువ పందిళ్లకు మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఏటా దువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇవాళ కూడా ఈ ఆలయంలో శ్రీరామనమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకలు నిర్వహించే సమయంలో చలువ పందిళ్లకు మంటలు అంటకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి ఆలయంలో ఉన్న వారంతా బయటకు వచ్చారు. క్షణాల వ్యవధిలో చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.