తిరుపతి:  తిరుమల కొండపైకి అనుమతి ఇవ్వాలని కోరుతూ అలిపిరి వద్ద భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు టికెట్లు లేకుండానే తిరుమలకు వందలాది మంది భక్తులు వస్తున్నారు. 

వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేయాలని భక్తులు ఆందోళనకు దిగారు.దీంతో పోలీసులు అడ్డుకొన్నారు. సోమవారం నుండి జనవరి 3వ తేదీ వరకు సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ అయ్యాయి. 

డిసెంబర్ 24 నుండి జనవరి 3 వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికుకు మాత్రమే టీటీడీ టోకెన్లను జారీ చేయనుంది.  ఇప్పటివరకు  2 లక్షల టోకెన్లను ఆన్‌లైన్లో జారీ చేశారు.  ఇవాళ్టి నుండి జనవరి 3వ వరకు శ్రీవారి దర్శనం కల్గిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ కోరింది. 

వెంకన్న దర్శనం  టికెట్లు లేని భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.భక్తులు మాత్రం తమకు దర్శనం కల్పించాలని టీటీడీని కోరుతున్నారు.అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

భక్తుల ఆ:దోళన నేపథ్యంలో పోలీసులు వారిని అలిపిరి నుండి పంపించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై టీటీడీ అధికారులు  అత్యవసరంగా సమావేశం కానున్నారు.