మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ధీమాతోటి, అహంకారం వల్లే ఓడిపోయామని అన్నారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ధీమాతోటి, అహంకారం వల్లే ఓడిపోయామని అన్నారు. గెలుస్తామనే బలుపు వల్లే ఓడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పథకాలు ఇచ్చాం.. పసుపు, కుంకుమ ఇచ్చామని వీర తిలకాలు దిద్దుకుని ఊరేగామని, తమ పథకాలే గెలిపిస్తాయనే ధీమా వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. 

వైసీపీ నేతలు మాత్రం ఓటర్ల కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రాధేయపడి గెలిచారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ఆంధ్రా ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇచ్చామనే ధీమాతో ఉంటే.. వైసీపీ వాళ్లు మాత్రం కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిపించండమ్మా అని ప్రాధేయపడితే ఓటర్లు జాలిపడి వారికి ఓటేశారన్నారు. మైలవరంలో తండ్రీ కొడుకులు, నందిగామలో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకుంటున్నారని విమర్శించారు.