సారాంశం

పోలవరం పర్యటనకు వెడుతున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్నారు. 

అమరావతి : టిడిపి నేత దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల బృందం శనివారం పోలవరం పర్యటనకు బయలుదేరింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టిడిపి నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. వీరిని కొవ్వూరు పాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇలా పెడుతున్న టిడిపి నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ తదితర నేతలు ఉన్నారు. 

వీరందరినీ పోలీసులు ఆపారు. దీంతో ఈ సమయంలో టిడిపి నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నేతలను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అయితే దేవినేని ఉమా పోలీసుల నుంచి తప్పించుకొని టు వీలర్ మీద పోలవరం బయలుదేరారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఎలాగో ఆపిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అక్కడినుంచి కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

టిడిపి నేతలను గోపాలపురం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అటు పోలవరం దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. టిడిపి నేతలు పోలవరంకు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.