అమరావతి: తన కులం విషయంలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనది ఎస్టీ సామాజికవర్గమేనని... కొండ దొర కులానికి చెందిన వ్యక్తినని శ్రీవాణి స్పష్టం చేశారు. తన సోదరి విషయంలో ఏ జరిగిందో తెలుసుకోకుండా కులాన్ని మద్యలోకి తీసుకురావడం దారుణమన్నారు శ్రీవాణి. 

తన సోదరి స్పెషల్ డీఎస్సీ పోస్టును వెనక్కు తీసుకున్నది నిజమే అయినా అది కులం విషయంలో కాదన్నారు. నాన్ లోకల్ కారణంగానే ఆమె పోస్టును వెనక్కి తీసుకున్నారని శ్రీవాణి వివరించారు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. 

2014 ఎన్నికల సమయంలో ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని నామినేషన్ పత్రాలతో కలిపి రిటర్నింగ్ అధికారికి సమర్పించానని... ఈ విషయంలోనే తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారని శ్రీవాణి గుర్తుచేశారు. అయితే కేవలం ఆర్డీవో మాత్రమే కాకుండా ఎమ్మార్వోకు కూడా ఎస్టీ కుల  ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం వుందని... నిబంధనల్లో కూడా అలాగే వుందన్నారు. అయితే తనపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని... నిజానిజాలు న్యాయస్థానమే తేలుస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 

పుష్ప శ్రీవాణి అసలు ఎస్సీ కులానికి చెందిన వారు కాదని... కానీ నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారంటూ ఆమెపై ప్రతిపక్ష పార్టీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. చెల్లుబాటు కాని కుల ధ్రు వీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి పోటీచేసి గెలిచారని...శ్రీవాణి ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలవగా నోటీసులు కూడా జారీ అయ్యాయి. 

 విజయనగరం జిల్లా కురు పాం(ఎస్టీ) నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి ఎన్నికను సవాల్‌ చేస్తూ ఆమె ప్రత్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్‌.జయరాజు  హైకోర్టును ఆశ్రయించారు. పుష్పశ్రీవాణి కొండదొరగా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని... కానీ అది చెల్లుబాటు కానిదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు.