సినిమా టికెట్లు అలా అమ్ముతుంటే చూస్తూ ఊరుకున్నారే..: కలెక్టర్లతో పవన్ కల్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు పవన్.
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కల్యాణ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఎన్నికలకు ముందువరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసి ఇక పూర్తిస్థాయిలో పాలనపైనే దృష్టి పెట్టే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఇలా మెళ్లిగా సినిమాలకు దూరం జరుగుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు, సినీ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఓసారి పర్యావరణాన్ని కాపాడేవారిని హీరోలుగా చూపించేవారని... ఇప్పుడు చెట్లను నరికేవారిని హీరోలుగా చూపిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ కామెంట్ చేసారు. ఈ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ఫ మూవీని ఉద్దేశించినవేనని అప్పట్లో దుమారం రేగింది. పవన్ ఉద్దేశం ఎలా వున్నా అప్పటికే మెగా, అల్లు ఫ్యాన్స్ మద్య వార్ నడుస్తున్న వేళ ఈ కామెంట్స్ చేసారు... కాబట్టి తమ హీరోనే టార్గెట్ చేసే పవన్ కల్యాణ్ ఈ కామెంట్స్ చేసారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
ఇదిలావుంటే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరు పాల్గొన్నారు. ఇలా పవన్ కల్యాణ్ కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పేరేంట్-టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా పవన్ సినిమా హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
సినిమాల్లో నటించేవారిలో కాకుండా విద్యాబుద్దులు నేర్చించే ఉపాధ్యాయుల్లో హీరోలను చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తమ ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో నిల్చుని కాపలా కాసేవారు, దేశ రక్షణకూ ప్రాణాలను త్యాగం చేసిన అమరులు, తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేవారు నిజమైన హీరోలు... వారిపై అభిమానం పెంచుకొండి, గౌరవించడని విద్యార్థులకు సూచించారు పవన్.
ఇలా ఇటీవల కాలంలో సినిమాలు, సినిమావాళ్ల గురించి పవన్ కామెంట్స్ ఆసక్తికరంగా వుంటున్నారు. ఈ క్రమంలో గత వైసిపి ప్రభుత్వం ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించడంపైనా తాజాగా పవన్ స్పందించారు. గత పాలకులు సినిమాల విషయంలో ఎలా వ్యవహరించినా అధికారులు చూస్తూ ఉండిపోయారని పవన్ అన్నారు. సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు, మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్లముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదన్నారు. రాజ్యాంగ బద్దంగా పాలన సాగేలా చూడాల్సిన బ్యూరోక్రాట్స్ చూసిచూడనట్లు వ్యవహరించడం బాధించిందని పవన్ అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ(బుధవారం) ప్రభుత్వం సమావేశమయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత వైసిపి ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఆనాడు అధికారులు ప్రజలకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోలేదు కాబట్టే మేం రోడ్లమీదకు వచ్చి పోరాటం చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.