పులివెందుల ప్రజలకు అరాచకం తప్పింది అని చంద్రబాబు అన్నారు. పులివెందులలో జరిగిన జడ్పిటీసి ఉపఎన్నికలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పులివెందుల ఎన్నికలపై చంద్రబాబు కామెంట్స్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో జడ్పిటీసి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. పోలీసుల బందోబస్తు, పెద్ద హంగామా నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం రోజు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా కొందరు ప్రజలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ఆయన పులివెందుల జడ్పిటీసి ఉపఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
జగన్ అసహనం అందుకే
పులివెందులలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి చాలా కాలం అవుతోంది. వైఎస్ హయాం నుంచి అక్కడ ఇదే పరిస్థితి. ఎన్నికలు సవ్యంగా జరిగిన దాఖలాలు లేవు. ఈసారి పులివెందుల జడ్పిటీసి ఉపఎన్నికలు ప్రజాస్వామ్యం ప్రకారం జరిగాయి. అక్కడ ఎలాంటి అరాచకాలు జరగలేదని జగన్ అసహనంతో ఉన్నారు. జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కనీసం నామినేషన్ వేయలేని పరిస్థితి నుంచి ఈసారి 11 మంది పోటీ చేశారు.
శాంతి భద్రతలు బలంగా ఉన్నాయి
ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతలు బలంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ఎలాంటి ఆటంకం లేకుండా ఓట్లు వేశారు. గతంలో ఎప్పుడూ పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదు అని చంద్రబాబు అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పులివెందుల ఎన్నికల గురించి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పులివెందుల ప్రజలకు భయం పోయింది.. ఆ భయం జగన్ ని పట్టుకుంది అని అన్నారు.
జడ్పిటీసి ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలని రెచ్చగొట్టేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి ఓట్లు వేశారు. గతంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ కూడా టచ్ చేయలేకపోయింది. తమ ప్రభుత్వంలో కానిస్టేబుల్ వెళ్లి అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారు అని పయ్యావుల కేశవ్ అన్నారు.
