అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో భేటీ అయిన కేజ్రీవాల్ పలు అంశాలపై చర్చించారు. 

జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర కూటమి బలోపేతంపై చర్చించారు. అలాగే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కేజ్రీవాల్  కు వివరించారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన బీజేపీ యేతర కూటమికి కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. 

ఇటీవలే ఏపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ మద్దతు పలికారు. అలాగే ఢిల్లీలో కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన దీక్షకు సైతం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 

ఇకపోతే అమరావతికి తొలిసారిగా వచ్చిన కేజ్రీవాల్ కు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయవాడ విమానాశ్రయంలో కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి  మనీష్ సిసోడియాలకు మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమా మహేశ్వరరావు స్వాగతం పలికారు.