తూర్పుగోదావరి జిల్లాలో అధికార టీడీపీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఫిరాయింపు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు

తూర్పుగోదావరి జిల్లాలో అధికార టీడీపీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఫిరాయింపు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. సుబ్బారావు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు.

మళ్లీ ఎన్నికలు దగ్గరపడే సరికి.. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారావు.. టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ తనకు చేసిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. 

అయితే సుబ్బారావు వైసీపీలో చేరాలని పలువురు కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాగా.. ఈ విషయంపై ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేది లేనిది రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నారు.