పవిత్రమైన కాణిపాకం ఆలయంలో పనిచేసే అర్చకుడి ఇంట్లో జింక చర్మాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

చిత్తూరు : కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయ అర్చకుడి ఇంట్లో జింక చర్మం గుర్తించారు ఆలయ అధికారులు. ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి జింక చర్మాన్ని స్వాధీనం చేసుకుని అర్చకున్ని అదుపులోకి తీసుకున్నారు. నిత్యం దైవసేవలో వుండే అర్చకుడి వద్ద జింక చర్మం లభించడం సంచలనంగా మారింది. 

కాణిపాకం ఆలయ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో పనిచేసే సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈవో వెంకటేశ్ గుర్తించారు. దీంతో శనివారం స్వయంగా రంగంలోకి దిగిన ఆయన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది సాయంతో అర్చకులు, ఉద్యోగులు, వంటశాలలో పనిచేసే సిబ్బంది ఇళ్ళతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వరదరాజుల స్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ ఇంట్లో జింక చర్మం బయటపడింది.

కాణిపాకం ఆలయ ఈవో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు అర్చకుడి ఇంటికి చేరుకుని జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కృష్ణ మోహన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. జింక చర్మాన్ని అమ్మిందెవరో తెలుసుకుని అతడి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్వో బాలకృష్ణా రెడ్డి తెలిపారు. 

ఇదిలావుంటే కాణిపాకం ఈవో తనిఖీల్లో నిత్యాన్నదానం, గిడ్డంగి, పోటులో పనిచేసే సిబ్బంది చేతివాటం కూడా బయటపడింది. బియ్యం బస్తాలు, పప్పులు, వంట సరుకులు సిబ్బంది ఇళ్లలో గుర్తించారు. ఇలా నలుగురు వంటమనుషుల ఇళ్లలో భారీగా బియ్యం బస్తాలు, వంట సామాగ్రిని స్వాధీనం చేసుకుని గిడ్డంగికి తరలించారు. 

కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం చేస్తుంటారు. ఇలా ప్రతిరోజూ 2,500 మందికి సరిపడా వంటలు సిద్దం చేస్తుంటారు. అయితే స్వామి వారి సేవలు, అన్నదానం కోసం స్టోర్ రూం నుండి కావాల్సిన సరుకులను ముందురోజే సిబ్బంది తీసుకుని తెల్లవారుజామునుండి వంట ప్రారంభిస్తారు. అయితే స్టోర్ రూం నుండి తీసుకున్న వస్తువుల్లో కొన్నింటిని వంటచేసే వారు ఇళ్లకు తరలిస్తున్నట్లు ఈవో గుర్తించారు. అన్నదాన భవనం నుండి ఓ వంటమనిషికి చెందిన వ్యక్తులు బైక్ పై సరుకులు తరలిస్తుండగా ఈవో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఈ ఘటనతో ఆలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు నిర్దారణ కావడంతో ఈవో వెంకటేశ్ సీరియస్ చర్యలు చేపట్టారు. అర్చకులతో సహా ఆలయంలో పనిచేసే అందరి ఇళ్లలో తనిఖీలు చేపట్టగా అన్నదాన భవనంలో పనిచేసే ఏడుగురు సిబ్బంది ఇళ్లలో లక్షా ముప్పైవేల విలువచేసే సరుకులు లభించాయి. అలాగే ఓ అర్చకుడి వద్ద జింక చర్మం బయటపడింది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో వెంకటేశ్ తెలిపారు.