విజయవాడ: కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి కరోనా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా బయటపడుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షాలు, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను నిజం చేసేలాంటి సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు లారీ క్లీనర్ గా పనిచేసేవాడు. అయితే అతడు ఇటీవల లారీపై వెళ్లి మహారాష్ట్రలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. 

దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయినప్పటికి సదరు క్లీనర్ మృతదేహం మాత్రం సొంత గ్రామానికి చేరుకుంది. మహారాష్ట్ర నుండి  తరలించే  సమయంలో గానీ, గ్రామానికి చేరుకున్న తర్వాత కానీ ఆ మృతదేహానికి ఎలాంటి కరోనా  పరీక్షలు నిర్వహించలేదు. ఎవ్వరికీ తెలియకుండానే కుటుంబసభ్యులు గ్రామంలోని  స్మశానవాటికలో  పూడ్చిపెట్టారు. 

అయితే ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆలస్యంగా అయినా స్పందించారు. తుర్లపాడు స్మశానవాటికలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయటకు తీసి కరోనా పరీక్షలు నిర్వహించారు. మృతదేహం నుండి శాంపిల్స్ సెకరించిన వైద్యాధికారులు ల్యాబ్ కు పంపించారు.  

 మహారాష్ట్ర నుండి మృతదేహాన్ని ఏపికి ఎలా తీసుకువచ్చారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా ఓ అనుమాస్పద మృతదేహం రాష్ట్రాల బోర్డర్లను దాటుకుని ప్రయాణించిందని...  రెడ్ జోన్ పరిధిలో ఒక లారీలో శవాన్ని తీసుకొస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ  గ్రామస్తులు నిలదీస్తున్నారు.  ఎటువంటి కరోనా పరీక్షలు నిర్వహించకుండా శవాన్ని పూడ్చి పెట్టడం ఏంటంటూ వెల్లువెత్తుతున్నాయి.