గుర్తుతెలియని ఓ శవం బయటపడింది. ఈ శవం ఎవరిది..? హత్యా..? ఆత్మహత్య? లాంటివి తేల్చాల్సిన పోలీసులు... ఆ విషయం వదిలేసి.. శవం కోసం వాదులాడుకోవడం గమనార్హం. ఈ  కేసు మీ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే... కాదు మీ పరిధిలోకి వస్తుందంటూ వాదులాడుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా నాగలాపురం, పిచ్చాటూరు సరిహద్దు ప్రాంతాలైన నందనం, పులిగుండ్రం మధ్యలోని అరుణానది ఇసుకలో రెండు కాళ్లు మాత్రం పైకి కనిపిస్తుండటం చూసిన పశువుల కాపరులు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాగలాపురం ఎస్‌ఐ నరేష్‌, పిచ్చాటూరు ఎస్‌ఐ దస్తగిరిలు సంఘటనా స్థలాని చేరకుని పరిశీలించారు.
 
అనంతరం కేసునమోదు చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనని ఈ ఇరువురు ఎస్‌ఐలు ఒకరి కొకరు నాది కాదు నీదంటూ శవ పంచాయితీ పెట్టుకున్నారు. అర్థ్రరాత్రి వరకు ఈ పంచాయితీ నెలకొంది. ఇది కచ్చితంగా హత్యేనని... ఇసుక స్మగ్లర్లు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో విభేదాలు కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. కారణాలేమో తెలియదు గాని శవాన్ని వెలికి తీయడానికి పోలీసులు వెనకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. కనీసం పోలీసులు శవాన్ని బయటకు కూడా తీయకపోవడం గమనార్హం.