విజయవాడ: ప్రముఖ నటుడు మోహన్ బాబుపై దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా భూక్జాలు చెయ్యడం విన్నాం కానీ మోహన్ బాబు మాత్రం దర్శకుడు దాసరి నారాయణ రావు పేరును కబ్జా చేశారంటూ ఆరోపించారు. 

విజయవాడలో ప్రముఖ చానెల్ తో మాట్లాడిన ఆమె మోహన్ బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల తన హృదయం కలచివేస్తుందని చెప్తున్న మోహన్ బాబు దాసరి నారాయణ రావు మనవడు, తన కుమారుడు మాస్టర్ దాసరి నారాయణరావుకు చేస్తున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

మోహన్ బాబు వల్ల తన కుమారుడు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాడంటూ ఆమె ధ్వజమెత్తారు. దాసరి నారాయణ రావు చనిపోయినప్పుడు ఆస్తుల పంపకాలకు సంబంధించి రెండు రోజుల్లో తేలుస్తానని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదని సుశీల ఆరోపించారు. 

పెద్దమనిషిగా వ్యవహరిస్తానని ఆనాడు చెప్పిన మోహన్ బాబు ఆ తర్వాత మాటమార్చారని చెప్పుకొచ్చారు. ఆస్తుల పంపకం గురించి అడుగుతుంటే నాకేం సంబంధమంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. అప్పుడు ఆస్తులు పంచుతానని చెప్పి ఇప్పుడు మాటలు మార్చి తన  కొడుకు మాస్టర్ దాసరి నారాయణ రావుకు తీరని అన్యాయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

అటు మరిది దాసరి అరుణ్ కుమార్ పైనా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు సమక్షంలో ఆస్తుల పంపకాలు జరుగుతాయని రోడ్డు ఎక్కొద్దని తన మరిది అరుణ్ కుమార్ చెప్పారని చెప్పుకొచ్చారు. 

మీడియాను ఆశ్రయిస్తే మూడు రోజులు లేదా నాలుగు రోజులు చూపిస్తారని ఆ తర్వాత మరచిపోతారని రోడ్డెక్కి దాసరి నారాయణ రావుగారి పేరు చెడగొట్టదని అరుణ్ చెప్పాడని ఆమె తెలిపారు. 

ఇటీవలే ఒక రాజకీయ పార్టీలో చేరిన అరుణ్ కుమార్ తన తండ్రి దాసరి నారాయణ రావు బతికి ఉంటే వైసీపీ తరపున పోటీ చేసేవారని చెప్పారని గుర్తు చేశారు. మెున్నటి వరకు దాసరి అరుణ్ మా కుటుంబ సభ్యుడు అని ఇప్పుడు ఒక నాయకుడు అని ఆమె వ్యాఖ్యానించారు. 

స్టేజ్ లపై మాట్లాడే అరుణ్ కుమార్ తన కుటుంబంలో జరుగుతన్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంట్లో తమకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలని అటు మోహన్ బాబుకు ఇటు దాసరి అరుణ్ కుమార్ లను డిమాండ్ చేశారు దాసరి సుశీల.