కడపలో ఓ ప్రభుత్వోద్యోగి హత్య కలకలం రేపుతోంది. కిడ్నాప్ అయిన 12 రోజులకు మృతదేహంగా లభించాడు.
కడప : ఆంధ్రప్రదేశ్లోని కడపలో దళిత ఉద్యోగి హత్య సంచలనంగా మారింది. పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చన్న (58)హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అచ్చన్న హత్యలో ఇతర వ్యక్తులతో పాటు సహోద్యోగులు కొందరి ప్రమేయం కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అచ్చన్నను కిడ్నాప్ చేసిన రోజే చంపేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. పోలీసులు ఈరోజు మీడియాకు వెల్లడించనున్నారు.
అచ్చన్న కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆయనను కనిపెట్టడానికి పోలీసులు తగిన చొరవ చూపలేదని తెలుస్తోంది. ఆయన కనిపించకుండా పోవడానికి కారణమైన అనుమానితులను విచారించలేదు. కనిపించకుండా పోయిన 12 రోజుల తర్వాత అచ్చన్న మృతదేహం అనుమానాస్పద స్థితిలో వెలుగు చూసింది. అప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి వైయస్ జగన్ సొంత జిల్లాలో ఇలా జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ దళితుడు, ప్రభుత్వ అధికారి కనిపించకుండా పోతే పోలీసులు నిర్లక్ష్యం వహించడానికి ఈ హత్య తార్కానంగా నిలుస్తుంది.
ఎమ్మెల్యేలను కొనేసి .. గెలిచామని సంబరాలు సంబరాలా : చంద్రబాబుపై మంత్రి కొట్టు ఆగ్రహం
అంతేకాదు అచ్చన్న మృతదేహం లభించిన తర్వాత పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. పోస్టుమార్టం చేయించేసి మృతదేహాన్ని ఆ తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. అచ్చన్న కడపలోని బహుళార్థ పశు వైద్యశాలలో ఉపసంచాలకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అక్కడే సహాయ సంచాలకులుగా పని చేసే శ్రీధర్ లింగారెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్ లకు మధ్య తగాదాలు ఉన్నాయి. గత ఆరు నెలలుగా వీరి మధ్య గొడవలు నడుస్తున్నాయి.
విధి నిర్వహణలో ఈ ముగ్గురు సహాయక సంచాలకులు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించట్లేదని, ప్రభుత్వ నిబంధనలను పాటించట్లేదని, ఉప సంచాలకుడిగా తనకు సహకరించడం లేదని అచ్చన్న ప్రభుత్వానికి వారిని సరెండర్ చేశాడు. కాగా అచ్చన్ననే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ ముగ్గురు రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్ చేసిన ఆ ముగ్గురిని విధుల్లో చేర్చుకోవాలని ఉన్నతాధికారులు అచ్చెన్నను ఆదేశించారు. కానీ దీనికి.. ఆయన నిరాకరించారు.
12వ తేదీన ఘటన జరిగిన కొద్ది రోజులకే అచ్చెన్న కనిపించకుండా పోయాడు. అంతటా వెతికిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత 14వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత పది రోజులు గడిచిపోతున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. 24వ తేదీన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ లో ఓ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చి పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం అచ్చన్నదిగా గుర్తించారు.
అచ్చన్నను నిందితులు కడపలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని చర్చి వద్ద నుంచి కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశించినట్లుగా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన హత్య మీద పూర్తిస్థాయి విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వివరించారు.
