ఆ విషయం అడిగారు..: అమిత్ షాతో లోకేష్ భేటీ, చంద్రబాబు అరెస్ట్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

daggubati purandeswari key comments on amit shah and nara lokesh meeting ksm

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుపై ఉన్నకేసులు కోర్టుల్లో ఉన్నాయని.. వాటిపై మాట్లాడితే సబ్ జుడిస్ కిందకు వస్తుందని అన్నారు. 

నారా లోకేష్‌ను అమిత్ షా పిలిచారా? లేదా అమిత్ షాను కలవాలని లోకేష్ అడిగారా? అనేది అప్రస్తుతమని పురందేశ్వరి అన్నారు. అమిత్ షా, లోకేష్ భేటీ జరిగిందని చెప్పారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారని.. ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని తెలిపారు. కిషన్ రెడ్డి పిలిచినట్టుగా లోకేష్ అన్నారని.. దాని గురించి ఆయననే అడగండి అని పరందేశ్వరి అన్నారు.

గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని పురందేశ్వరి విమరశించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. ఇది దారుణం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ ఎంక్వైరీ వేయించారని.. ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద జగన్ సీబీఐ విచారణ కోరగలరా? అని ప్రశ్నించారు.  

మద్యం విషయంలో ప్రభుత్వం తీరును తాను తప్పుపట్టానని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అయితే అందుకు వైసీపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పేవి తప్పుడు లెక్కలు అని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మద్యం విషయంలో తాము ఉద్యమించామని చెప్పారు. గత ప్రభుత్వంలో 12 లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు లైసెన్సులిచ్చారని అన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం కంపెనీల యజమానులు గతంలో ఎవరు? ఇప్పుడెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం కంపెనీ తయారీదారులను బెదిరించి ఓనర్ షిప్ మార్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం కంపెనీ ఓనర్ల పేర్లు సాయంత్రానికల్లా బయటపెట్టే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం అమ్మకం, తయారీదారులపై కేసులు పెడతామని జగన్ చెప్పారని.. మరి మద్యం కంపెనీలపై కేసులు పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికుందా? అని ప్రశ్నించారు. 

మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఎందుకు అమలు చేయడం లేదని పురందేశ్వరి ప్రశ్నించారు.మద్యం అమ్మకాల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు అక్రమంగా తరలించేందుకు డిజిటల్ పేమెంట్లు అమలు చేయడం లేదని ఆరోపించారు. గత రెండేళ్ల కాలంలో నాసిరకం మద్యం వల్ల చాలా మంది అనారోగ్యం బారున పడ్డారని అన్నారు. గత రెండేళ్ల కాలంలో నాసిరకం మద్యం ద్వారా అనారోగ్యం బారిన పడ్డ కేసులు 25 శాతం పెరిగాయని మండిపడ్డారు. నాసిరకం మద్యం వల్ల మరణించిన వారి పేర్లు.. ఇతర వివరాలు కూడా తాము సేకరించామని చెప్పారు. మద్యం మృతుల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరించ లేకపోతోందని ప్రశ్నించారు. నాసిరకం మద్యం వల్ల ఇబ్బందులు ఉంటాయని.. రోగాలు పెరుగుతాయని ఎస్జీఎస్ ల్యాబరేటరీ స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారు. మద్య వినియోగం తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నా.. క్రిసిల్ సర్వే ప్రకారం మద్య వినియోగం పెరిగిన రాష్ట్రాల్లో ఏపీ పేరే ముందు వరుసలో ఉందని తెలిపారు. నాసిరకం మద్యం వల్ల కిక్ రాని వారు అదనంగా బాటిళ్లు సేవిస్తున్నారని అన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో బడ్డి కొట్లు, ఇళ్లల్లోనూ మద్యం స్టాక్ పెట్టి అమ్మకాలు చేస్తున్నారని ఇవన్నీ బెల్ట్ షాపులు కావా? అనిప్రశ్నించారు. ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.  హామీలు అమలు చేయని వారికి పదవిలో కొనసాగే అర్హత లేదని జగన్ ఎన్నికల ముందు చెప్పారని.. మద్యంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోని జగన్ రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారా? అని నిలదీశారు. మద్య నిషేధం అమలు చేయబోమని సంతకం పెట్టి మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీలో శాండ్, లిక్కర్ విషయంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios